- నిరుపేద విద్యార్థులకు గట్టు శృతి స్ఫూర్తిదాయకం
తుంగతుర్తి ముద్ర:-కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నిజం చేస్తూ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించి నేడు ఎస్సైగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గట్టు శృతి నిరుపేద విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గట్టు దేవేందర్ ,హేమలత దంపతుల కూతురు గట్టు శృతి. నిరుపేద కుటుంబంలో జన్మించిన శృతి తన తల్లిదండ్రులు ఇద్దరు స్థానిక ప్రభుత్వ వైద్యశాల పక్కన చిన్న డబ్బా కొట్టులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న తీరును చూసి తాను కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రులను ఆదుకోవాలని దృక్పథంతో కష్టపడి చదివింది.
డిగ్రీ పూర్తి చేసి నాటి ప్రభుత్వ హయాంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాగానే ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఇంటి వద్దనే తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వివిధ రకాల పుస్తకాలను చదివి ఎంట్రన్స్‌లో స్థానం సంపాదించి ఎస్సై ఉద్యోగానికి అర్హత సాధించారు. నిరుపేద కుటుంబీకురాలైన శృతికి ఎస్సై ఉద్యోగం రావడం పట్ల తుంగతుర్తి పట్టణ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేశారు. నేడు తన ట్రైనింగ్ పూర్తి చేసి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైన శృతి అధికారుల నుండి ఉద్యోగ నియామక పత్రం పొందినట్లు తెలిపారు. అనంతరం ఎస్సైగా కాకి డ్రెస్ వేసుకొని సగర్వంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందారు .తాను డ్యూటీలో బాధ్యతగా నిర్వహిస్తున్నట్లు స్వయంగా పాటిస్తూ ముందుకు సాగుతానని తాను ఈ స్థితికి రావడానికి తన తల్లిదండ్రుల కారణమని వారికి ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటానని శృతి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శిక్షణ పూర్తి చేసుకున్న శృతికి తుంగతుర్తి పట్టణ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.