ముద్ర, తెలంగాణ బ్యూరో : మన రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలరీ మెడల్ కు ఎంపికయ్యారు. పంద్రాగస్ట్ వేడుకలు పురస్కరించుకుని ఈ ఏడాది అగ్నిమాపక, పోలీస్ ఇలా 1037 మంది భద్రతా సిబ్బందికి గ్యాలంటరీ అవార్డులు ప్రదానం చేస్తారు. వారిలో మన రాష్ట్రానికి చెందిన యాదయ్య ఈ పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ యాదయ్యకు రావడం పట్ల రాష్ట్ర డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాదయ్యను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య 2022లో ఓ దొంగతనం కేసులో ధైర్యంగా వ్యవహరించారు. చైన్ స్నాచింగ్, ఆయుధాల డీలింగ్‌కు ప్రయత్నిస్తున్న ఇద్దరు దుండగులు ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్‌ను సాహసోపేతంగా పట్టుకున్నారు. 2022 జులై 25న దొంగతనానికి కనిపించగా యాదయ్య వీరిని అడ్డుకున్నారు. దీనితో దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. ఛాతీ పైభాగన్న పలుమార్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావం అయినప్పటికి ఆయన వారిని పట్టుకున్నారు. తీవ్ర గాయాల కారణంగా 17 రోజుల పాటు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. దుండగులను బంధించేలా ఆయన చూపిన ధైర్యసాహసాలకు గానూ ఈ ఏడాది అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పతకాన్ని ప్రకటించారు.