- మేఘా సంస్థపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలి
- కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని కాపాడేందుకు ప్రభుత్వ ప్రయత్నం
- సుంకిశాల ను పరిశీలించిన బీజేపీ ఎమ్మెల్యేలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్లక్ష్యం వలనే సుంకిశాల ప్రాజెక్టు కూలిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మేఘా సంస్థపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సుంకిశాల ప్రాజెక్టును బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సుంకిశాల ఘటనపై వాటర్ బోర్డు ముగ్గురు ఇంజనీర్లతో వేసిన త్రిసభ్య కమిటీ ఎప్పటిలోగా వస్తుందని ప్రశ్నించారు. వాటర్ బోర్డు నుంచి సమగ్ర నివేదిక లేకుండా మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వర రావులు సుంకిశాల ప్రమాదం చిన్నదేనని చెబుతున్నారని ఆయన నిలదీశారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటన జరిగి 12 రోజులవుతున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వం వివరణాత్మక ప్రకటన ఎందుకు చేయలేదని అన్నారు.
ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. మేఘా సంస్థ నాసిరకం పనులు చేస్తే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ హయాంలో జరిగిన అవినీతి కాంగ్రెస్ హయంలో ఎందుకు ముసుకు పోతుందని అన్నారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంతంలో బ్రహ్మేశ్వర ప్రాజెక్టు కడ, అందులో కూడా నాసిరకం పనులు ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు మాట్లాడుతూ.. సుంకిశాల ఘటనను ప్రభుత్వం గోప్యంగా ఉంచడం బాధాకరమన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం నోరు మెదపకుండా ఉంటడం దురదృష్టకమని అన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. పారదర్శకంగా విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్నారు.