- క్షేత్రస్థాయి బలంపై అంచనాలు
- టీడీపీ ఓటు బలంగా ఉందంటూ చంద్రబాబు అంచనా
- తాజాగా రాష్ట్రంలో సర్వేలు ప్రారంభించిన చంద్రబాబు టీం
- స్థానిక ఎన్నికల్లో పోటీ నిర్ణయం
- ఇక నుంచి ప్రతినెలా రెండో శనివారం ఇక్కడే
- రాష్ట్రానికి త్వరలో కొత్త చీఫ్
- ఇద్దరు ఎమ్మెల్యేల చేరుతారనే ప్రచారం
- ఏపీలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంపై ఫోకస్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-`స్థానిక’ సమరానికి సైకిల్ పార్టీ ఉరకలు వేస్తోంది. ఆ ఎన్నికల ద్వారా మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ….. ఇకపై రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే గ్రామ స్థాయిలో నమోదు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను విజయవంతం చేసిన అనంతరం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పక్కగా పార్టీ, దాని అనుబంధ కమిటీలను వేయాలని నిర్ణయించింది.
ఈ కమిటీలను త్వరగా పూర్తి చేయడం ద్వారా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను ఎంపిక చేయడం తహతహలాడుతోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీలో అధికారం కొనసాగుతున్న నేపథ్యంలో…. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ విస్తరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు పలు వ్యూహాలను పదును పెడుతుంది. కాగా పలు కారణాలతో గతంలో పార్టీ వీడిన కొందరు నేతలు ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్‌లో మంతనాలు సాగించినట్లుగా తెలుస్తోంది. మరి కొందరి హిందూ నియోజకవర్గం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో మంతనాలు కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారని.
కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న కొందరు శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీలు, అగ్రనేతలు కూడా చంద్రబాబుతో భేటీ అవ్వాలని కోరారు. వారిలో ఇద్దరు శాసనసభ్యులు కారుకు టాటా చెప్పి….సైకిల్ ఎక్కేందుకు దాదాపు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే బాబుతో చర్చలు జరిపిన వారు టీడీపీలో చేరినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది…. ప్రస్తుతం రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరి కొందరు స్థబ్దుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని కూడా నిర్మించేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు. ప్రస్తుతం నాయకుల కొరత…. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలానికి ఢోకా లేదని చంద్రబాబు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలాన్ని కూలంకషంగా తెలుసుకునేందుకు ఇప్పటికే ఆయన తన టీంను రంగంలోకి దించినట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరి బృందం కూడా రాష్ట్రంలో సర్వే ను కూడా మొదలు పెట్టినట్లుగా సమాచారం. ఇక చంద్రబాబునాయుడు కూడా ప్రతి నెల రెండవ శనివారం హైదరాబాద్ లోనే ఉండేందుకు నిర్ణయించారు. ఆ రోజు తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో సమావేశమై….వారిగా దశ దిశను నిర్దేశించనున్నారు. అలాగే టీడీపీ అంటే తెలంగాణ ప్రజల్లో కూడా అపారమైన అభిమానం పెరిగింది.
చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ లో స్వచ్చందంగా ప్రజలు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు వారు నేరుగా రోడ్ల పైకి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇక జీఎం సి బాలయోగి స్టేడియంలో టెక్కీలు నిర్వహించిన సభకు భారీగా ఉద్యోగాలు తరలి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని అనేక ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు మద్దతుగా అనేక నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు….. ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిపై అప్పుడే తెలంగాణకు చెందిన పలువురు నేతలు దృష్టి సారించారు. ముమ్మర ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.
బాబు నిర్ణయంతో ప్రధాన పార్టీల్లో దడ
స్థానిక సంస్థల్లో పోటీ చేయడం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో అప్పుడే ప్రధాన పార్టీల్లో దడ మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉండటం వల్ల… పార్టీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు అన్నీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పంచుకున్నాయి. దీని వల్ల పలు నియోజకవర్గాల్లో వివిధ పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ వంటి టీడీపీ ఓటర్లు మొగ్గుచూపిన అభ్యర్ధులు జిల్లాలో భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అందుకే ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు బహిరంగంగానే పార్టీ కార్యాలయాలకు వెళ్లి….తమకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో టీడీపీ మళ్లీ ఎన్నికల కదన రంగంలోకి కాలు మోపుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసి వెళ్ళిన టీడీపీ….ఈసారి తెలంగాణలో అదే అస్త్రాన్ని ఉపయోగిస్తుందా…లేక ఒంటిరిగానే పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే టీడీపీ ఎలా బరిలో నిలిచినా….ప్రత్యర్థి పార్టీలకు మాత్రం ముచ్చెమటలు పట్టించడం ఖాయమని.