- ఏఐ ఆదారిత డేటా సెంటర్ పై చర్చలు
- అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా తన డేటా సెంటర్‌ను విస్తరించేందుకు సిద్ధమైంది. విదేశీ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అవసరమైన సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు.
రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ వస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సౌకర్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్సర్వీసెస్ క్లౌడ్ సేవాసంస్థలకు హైదరాబాద్ కీలక పాత్ర పోషించడంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు. కాగా అమెజాన్ కంపెనీ ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద భవనం హైదరాబాద్‌లో ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు (AWS) సంబంధించి హైదరాబాద్‌లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్న ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.