- వరద నీటిలో రామాలయం
- ఎడతెరిపి వానలకు రామాలయం చుట్టూ వరద నీరు
- నీట మునిగిన అన్నదాన సత్రం
- కుంగిన హరినాధబాబా కల్యాణమండపం
- ఆలయానికి ఆనుకుని ఉన్న 35 దుకాణాలు నీటి మునక
- అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి తుమ్మల సీరియస్
ముద్ర, తెలంగాణ బ్యూరో : భద్రాచలంలోని రామాలయం ‘జల’వలయమైంది. ఈ నెల 6 రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రామాలయం పడమర మెట్ల వద్దకు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 గృహాలకు వరద నీరు చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది. ఆలయానికి సమీపంలో ఉన్న అన్నదాన సత్రంలోకి వర్షపు నీరు ప్రవేశించింది. భద్రాచలం గుట్టపై ఉన్న హరినాధబాబా ఆలయం వద్ద కల్యాణమండపం కుంగింది. అయితే వరద ఇలానే వచ్చి చేరితే కల్యాణ మండపం కిందపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మంత్రి తుమ్మల సీరియస్..
రామాలయం అన్నదాన సత్రం, విస్టా కాంప్లెక్స్‌లో వరద నీరు చేరడంపై జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీరు చేరిన వెంటనే మోటర్లు ఎందుకు ఆన్ చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్ష దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. వరద నీరు కరకట్ట స్లూయిజ్ లాకులు ఎత్తివేయాలని మంత్రి సూచించారు. ఇదిలావుంటే.. ఆలయ పరిసరాల్లోకి వరదనీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది భక్తులు ఆలయంలోనే ఉండిపోయారు.
కలెక్టర్ పరిశీలన..
రామాలయం చుట్టూ వరద నీరు చేరిన ఘటనపై ఆరా తీసిన మంత్రి తుమ్మల ఆ స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ను గుర్తించారు. దీంతో అధికారులతో కలిసి ఆయన హరినాధ ఆలయం కల్యాణ మండపాన్ని పరిశీలించారు. కొండ కింద ఉన్న ఇళ్లు, దుకాణాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు రామాలయం వద్ద అన్నదాన సత్రంలోకి వర్షపునీరు చేరింది. పడమరమెట్ల వద్ద వర్షపు నీట వల్ల నిలిచిపోయిన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. వరద నీటిలోనే వైద్యులు చికిత్స అందించారు.