ఒడిశా రాష్ట్ర సర్వతోముఖ వికాసానికి బాటలు వేసిన మహానాయకుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 24 ఏళ్ల పాటు తనదైన శైలిలో పాలన సాగించిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ అక్కడి ప్రజానీకం సెలవు చెప్పారు. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో 78 స్థానాలను భారతీయ జనతా పార్టీకి కట్టబెడుతూ, అధికారాన్ని అప్పగించారు. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ పార్టీకి కేవలం 51 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. భువనేశ్వర్ లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారమే తన రాజీనామాను గవర్నర్ రఘుబీర్ దాస్ కు అనుమతి. అంతవరకు ఓకే… ఎన్నో ఏళ్లుగా ఒడిశాలో తమ పార్టీ జెండా రెపరెపలాడాలని భావించిన కాషాయదళం ఎట్టకేలకు ప్రజావిశ్వాసం పొందగలిగింది.
ఇప్పుడు బీజేపీలో సీనియర్లు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా జోయల్ ఓరం, ధర్మేంద్ర ప్రధాన్, బైజయంత్ పండా, సంబిత్ పాత్రతో పాటు గుజరాత్ కేడర్ ఐఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము తలపడుతున్నారు.
వీరిలో జోయల్ ఓరం గతంలో ఒకసారి శాసనసభ్యునిగా, అయిదు సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. 63 ఏళ్ల వయసున్న ఆయన సుందర్ గడ్ ప్రాంతంలోని మధ్య ఆదాయ వర్గానికి చెందిన గిరిజన తెగకు చెందిన వారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా, డిగ్రీ చేశారు. భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)లో అయిదేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత రాజీనామా చేసి రాజకీయాలలోకి ప్రవేశించారు. 1999 అక్టోబరు 29న ఆయన ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత 2024 ఎన్నికలలో ఆయన సుందర్ గడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ, ఒకవేళ తనకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే, నమ్మకంగా పనిచేస్తానని చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని తాను కోరుకోవడం లేదని, బాధ్యతలు అప్పగిస్తే మాత్రం కాదననని స్పష్టం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్ పూర్ నుంచి తన ప్రత్యర్థి బీజేడీకి చెందిన ప్రణబ్ ప్రకాష్ దాస్ పై దాదాపు లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన ఒడియా ప్రైడ్ పేరుతో ప్రచారం నిర్వహించారు. బీజేపీకి బాగా కలిసొచ్చింది. 2000 సంవత్సరంలో ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన 2004లో ఒడిషాలోని డియోగడ్ నుంచి ఎంపీగా లోక్ సభకు ప్రాభవం వహించారు. 2009లో పల్లహార అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత బీహార్ రాష్ట్రం నుంచి. అనంతరం మధ్యప్రదేశ్ నుంచి రెండుదఫాలుగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. బీహార్ కు ఎన్నికల ఇన్ఛార్జిగా, కర్ణాటక, ఉత్తరాఖండ్, జార్ఘండ్, ఒడిశాలకు పార్టీ ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్ చెబుతున్న దాని ప్రకారం, మిగిలిన నాయకులకంటే సీఎం రేసులో ఈయనకు ప్రాధాన్యత ఉంటుంది. పదేళ్ల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం వల్ల మిగిలిన పోటీదారులకంటే ముందువరుసలో ఉంటారు.
వీరితో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. పూరీ నియోజకవర్గం నుంచి ఆయన కొత్తగా ఎంపీగా ఎన్నికయ్యారు. యాభయ్యేళ్ల వయస్సున్న ఆయన వైద్యశాస్త్ర పట్టాను కలిగి ఉన్నారు. రాజకీయాలలోకి రాకమునుపు ఆయన ఢిల్లోని హిందురావు ఆసుపత్రిలో పనిచేశారు. 2012లో కాషాయదళంలోకి ప్రవేశించిన ఆయన ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ప్రాంగణంలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో ఆయన జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంతి పండా కూడా సీఎం రేసులో బలమైన వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ నాయకుల మద్దతుతో కొనసాగుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బీజేపడీ అభ్యర్థి అన్షుమన్ మొహంతని 66,536 ఓట్ల తేడాతో ఓడించారు. అరవయ్యే వయస్సున్న ఆయన ఒకసారి రాజ్యసభ ఎంపీగా, రెండుసార్లు లోక్ సభకు బీజేడీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజకీయాలలోకి రాకమునుపు ఆయన మిచిగాన్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో పనిచేశారు. ఆరేళ్ల క్రితం బీజేపీలో చేరారు.
రేసులో గుజరాత్ కేడర్ రిటైర్డ్ ఐఎస్ అధికారి ముర్ము
ఒడిశా సీఎం రేసులో గుజరాత్ కేడర్ రిటైర్డ్ ఐఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈయన 1985 బ్యాచ్ అధికారి అయిన ఆయన స్వస్థలం ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లా బెట్ నోటి. 65 ఏళ్ల వయసున్న ఆయన ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన జమ్ము కాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా, కంప్ట్రోలర్ ఆడిటర్ గా, ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సీనియర్ సెక్రటరీగా అలాగే పలు ప్రధానమైన హోదాలలో పనిచేశారు.
ఒడిశా ముఖ్యమంత్రి నియామకం పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం మేరకు జరుగుతుందని, ఒడిషా ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే నాయకుడే సీఎంగా వస్తారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ పేర్కొన్నారు.