
సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు
ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు ఖుషీ అవుతున్నాయి. వరుసపెట్టి ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని అభినందించే పనిలో పడ్డాయి. గతవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో బకాయిలు చెల్లింపు, పీఆర్సీ సవరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు పలు స్పష్టత వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు కూడా సానుకూలంగా స్పందించాయి. సీపీఎస్ స్థానంలో జీపీఎస్‌ను ప్రవేశపెట్టడానికి అమోదం తెలిపాయి. దీంతో ఉద్యోగ సంఘాలు సీఎంకు ధన్యవాదాలు చెప్పేందుకు పోటీ పడుతున్నాయి. మంగళవారం ఏపీజేఏసీ అమరావతి నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన పలు విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. 60 రోజుల వ్యవధిలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకు రావడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.