
Palnadu Fire Accident : పల్నాడు జిల్లాలో విషాదం. అగ్నిప్రమాదంలో చిన్నారి సజీవ దహనం అయింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదపాలెం ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం. ఈ ఘటనలో ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారి సజీవ దహనం కాగా మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పెదపాలెం పంట పొలాల్లో వ్యర్థాలకు నిప్పుపెట్టారు కొందరు రైతులు. వేసవికావడంతో ఈదురు గాలులు ప్రభావంతో…మంటలు సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీల్లో ఇళ్లకు వ్యాపించాయి. వీటితో కాలనీలోని ఐదు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక పూరి గుడిసెలో ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారి పల్లవి మంటల్లో సజీవదహనం అయింది. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు మేరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఇళ్లకు మంటలు వ్యాపించగానే స్థానికులు క్రోసూరులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా చెలరేగాయి. దీంతో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.