తెలంగాణ

సగం మంది డబ్బులు ఎగ్గొట్టారు: సందీప్‌ కిషన్‌

హైదరాబాద్‌: ఇప్పటి వరకూ 14 సినిమాల్ని పారితోషికం తీసుకోకుండా చేశానని యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ తెలిపారు. ఆయన నటించి, నిర్మించిన సినిమా ‘నిను వీడని నీడను నేనే’. కార్తిక్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అన్య సింగ్‌ కథానాయిక. మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. జులై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

* ‘రెండేళ్ల నుంచి నన్ను నేను వెండి తెరపై చూసుకోలేదు. గత చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో నిరుత్సాహానికి గురయ్యాను. ఇక్కడ ఉంటే అదే ఆలోచనతో ఉంటానేమో అని భయపడి, విదేశాలకు వెళ్లాను. తిరిగొచ్చాక దాదాపు 30 కథలు విన్నాను. అందులో నాకు బాగా నచ్చిన కథ ‘నిను వీడని నీడను నేనే’. గత పరాజయాలు చాలా పాఠాలు నేర్పాయి. సినిమా జరుగుతుండగానే ‘ఇది ఆడదు’ అనే నిజం తెలిసిపోయేది. నేను ఎక్కడైతే లోపాలు ఉన్నాయనుకున్నానో, చివరికి ఆ లోపాలే జనాలు, సినీ విశ్లేషకులు కూడా చెప్పేవారు. నా సినిమా నేనే తీసుకుంటే, నాకు నచ్చినట్టు చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే నిర్మాతగానూ మారాను. ఓ రకంగా ఈ సినిమా నా నమ్మకానికి పరీక్షలాంటిది’.

* ‘హారర్‌ సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఓ నటుడికి హారర్‌ సినిమాలో కొత్తగా చేయడానికి ఏమీ ఉండదని అనుకునేవాడ్ని. హారర్‌ సినిమాలు బాగా ఆడుతున్న రోజుల్లో కూడా ఈ జోనర్‌ని ఎంచుకోలేదు. కానీ ‘నిను వీడని నీడను నేనే’ కథ నా ఆలోచన మార్చింది. ఇది కేవలం హారర్‌ చిత్రమే కాదు. ఇందులో చాలా రకాల అంశాలున్నాయి.  ‘హారర్‌ సినిమా చూశాం’ అని కాకుండా ‘ఓ మంచి సినిమా చూశాం’ అనే తృప్తితో జనాలు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’.

* ‘నలుగురూ మనల్ని గుర్తించాలని ఏ నటుడైనా అనుకుంటాడు. నేనూ అలానే అనుకున్నా. ఆ గుర్తింపుని కూడా దక్కించుకున్నాను. ఒంటికి గాయాలైనా లెక్క చేయలేదు. ఇప్పటి వరకూ 14 సినిమాలు ఫ్రీగా చేసుంటాను. నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవడం లేదు. ఆ కథలు నచ్చడంతోనే డబ్బులు తీసుకోకుండా నటించాను. ‘సినిమా హిట్టయితే డబ్బులిస్తాం’ అని నిర్మాతలు చెప్పారు. అందులో సగం ఫ్లాప్‌ అయ్యాయి. సగం మంది ఎగ్గొట్టారు. ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ ఎల్‌.ఎల్‌.బీ’ సినిమా చేస్తున్నా’.

* ‘ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ నేను అందుకు రివర్స్‌. తమిళంలో నాకు మంచి సినిమాలు పడ్డాయి. ఒప్పుకోవాలే గానీ, నాలుగైదు తమిళ చిత్రాలు రెడీగా ఉన్నాయి. హిందీలోనూ హిట్టు కొట్టాను. అమేజాన్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేశాను. తెలుగులోనే సరైన సినిమా రాలేదు. అందుకే ఇప్పుడు ‘ఇంట గెలిచి తీరాలి’ అనుకుని ఈ సినిమా చేశాను. టీజర్‌, ట్రైలర్‌ ఆసక్తికరంగా కట్‌ చేశాం. ఇప్పుడు ఈ సినిమా హిందీలో చేస్తామంటూ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది’.