ఆంధ్రప్రదేశ్క్రైమ్

రైతులపేరిట నకిలీ ఖాతాలు..రూ.కోటి స్వాహా!

కంచికచర్ల గ్రామీణం: రైతులు గోల్డ్‌ లోన్‌ నిమిత్తం తమ బంగారాన్ని బ్యాంకులో పెట్టగా.. అదే బంగారంతో మరో ఖాతా సృష్టించి బ్యాంకు క్యాషియర్‌ నగదు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల ఎస్బీఐలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 90 మంది రైతుల పేరిట బ్యాంకు క్యాషియర్‌ శ్రీనివాసరావు నకిలీ ఖాతాలు సృష్టించి సుమారు కోటి రూపాయల వరకు స్వాహా చేసినట్లు బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో మే 13న అంతర్గత ఆడిట్ నిర్వహించగా.. ఈ ఆడిట్‌లో నకిలీ ఖాతాల విషయం బయటపడింది. దీంతో బ్యాంకు క్యాషియర్‌ను మే 17న సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలో రైతులు గత నాలుగు రోజులుగా తమ బంగారం కోసం బ్యాంకుకు వెళితే సర్వర్లు మొరాయించాయని అధికారులు తెలిపారు. దీంతో బాధిత రైతులు సోమవారం బ్యాంకు అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలిసిన తర్వాత బంగారం తిరిగి ఇచ్చేస్తామని బ్యాంకు మేనేజర్‌ రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం క్యాషియర్‌ శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.