జాతీయం

రాయ్‌బరేలీలో సోనియా, ప్రియాంక పర్యటన

యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆమె తొలిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. తన కుమార్తె, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో కలిసి ఆమె ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశం అవుతారు.  బుధవారం సాయంత్రం 2,500 మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొంటారు. తనను మరోసారి ఇక్కడి నుంచి గెలిపించినందుకుగానూ ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు.

అతిథి గృహంలో ప్రియాంకా గాంధీ తమ పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమి చెందిన అంశంపై ఆమె పార్టీ నేతలతో చర్చిస్తారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆమె కూడా ఈ ప్రాంతంలో తొలిసారి పర్యటిస్తున్నారు. బుధవారం సాయంత్రం జరగనున్న సమావేశంలో సోనియా గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ మాట్లాడే అవకాశం ఉంది. ఈ నియోజక వర్గంలో భాజపా అభ్యర్థి దినేశ్‌ సింగ్‌పై సోనియా గాంధీ 1,67,178 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.