క్రైమ్

ముగ్గుర్ని బలిగొన్న బావి

ఒకరి తర్వాత ఒకరుగా ఇంటి వద్దనున్న బావిలో దిగిన ముగ్గురు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. కుమురం భీం జిల్లా కౌటాల మండలంలో బుధవారం జరిగిన ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
ముత్యంపేట గ్రామానికి చెందిన కారెం మహేష్‌(17) ఇంట్లోని బావిలో బిగించిన విద్యుత్తు మోటారుకు మరమ్మతు చేసే నిమిత్తం అందులో దిగాడు. ఎంతకీ తిరిగి రాకపోవడం, ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోవడంతో అనుమానించిన బావ వరసయ్యే చొక్కాల శ్రీనివాస్‌(25) విద్యుత్తు సరఫరా నిలిపేసి అందులో దిగాడు. ఆయనా తిరిగిరాకపోవడం, పిలిచినా స్పందన లేకపోవడంతో ఆయన బావమరిది గాదిరెడ్డి రాకేశ్‌(19) బావిలో దిగి అక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు మందమర్రి నుంచి రెస్క్యూ బృందాలను రప్పించారు. బావిలో ప్రాణవాయువు అందక వారంతా మృతి చెందినట్టు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు. ఒకర్ని కాపాడటం కోసమని ఇంకొకరు..ఇలా ముగ్గురూ అనంత లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదం అలముకుంది.

మూడు కుటుంబాల్లో విషాదం
కారెం రాజు, బుజ్జవ్వ దంపతులకు మహేష్‌ ఒక్కడే సంతానం. ఇంటర్‌ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చూస్తుండగానే కన్నుమూయడంతో ఆ దంపతులు కుప్పకూలారు. గాదిరెడ్డి అంజయ్య, లక్ష్మక్క దంపతులకు ఒక కుమారుడు రాకేశ్‌, ఓ కుమార్తె. కుమారుడు, అల్లుడు శ్రీనివాస్‌ మరణంతో వారు తల్లడిల్లారు. బుజ్జవ్వ, లక్ష్మక్క అక్క చెల్లెళ్లు.