తెలంగాణ

మా పోరాటం ఇంతటితో ఆగదు: ఉత్తమ్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేయడంపై తాము చేపట్టిన పోరాటం ఇంతటితో ఆగదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షా శిబిరంపై దాడి చేసి భట్టి విక్రమార్కను అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. తెరాసకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక ఉండకూడదనే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను విలీనం చేయడం ఏమిటన్నారు. తామంతా చేసిన విజ్ఞప్తితోనే భట్టి దీక్ష విరమించారని స్పష్టంచేశారు.

కేసీఆర్‌ నోరు విప్పాలి
తెరాసలో సీఎల్పీ విలీనంపై తాము హైకోర్టును ఆశ్రయించామని.. మంగళవారం హైకోర్టులో విచారణకు వస్తుందన్నారు. అక్కడ వచ్చే తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కుతామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీకి ఏవిధంగా ఇస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయనున్నట్టు ప్రకటించారు. తెరాసలో సీఎల్పీ విలీనం వ్యవహారంపై కేసీఆర్‌ నోరు విప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.