జాతీయం

మార్కెట్లోకి ఐషర్‌ బీఎస్‌-6 వాహనాలు

బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా తయారు చేసిన తేలికపాటి ట్రక్కులను ఐషర్‌ సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీఈసీవోలో భాగమైన ఐషర్‌ ఈ వాహనాన్ని విడుదల చేసింది. అత్యంత పోటీ ఉన్న తేలికపాటి ట్రక్కుల విభాగమైన ప్రో 2000 సిరీసులో వీటిని తీసుకొచ్చింది. వీటిల్లో ఐషర్‌ ప్రో 2049 , ఐషర్‌ ప్రో 2095ఎక్స్‌పీలను తీసుకొచ్చింది. వినియోగదారులకు అత్యధిక లాభాలు వచ్చేట్లు, నమ్మకంగా ఉండేట్లు వీటిల్లో మార్పులు చేసి ఇస్తామని ఐషర్‌ పేర్కొంది. ప్రో2000 సిరీస్‌లో కొత్తగా రెండు ఇంజిన్‌ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి సరికొత్త భారత్‌ స్టేజ్‌ నిబంధనలను సంతృప్తి పరుస్తాయి.
కొత్త ట్రక్కుల్లో స్మార్ట్‌ క్యాబిన్లను ఏర్పాటు చేశారు. 33ఏళ్ల తర్వాత క్యాబిన్లలో మార్పులు చేర్పులు చేయడం విశేషం. దీంతోపాటు స్టీరింగ్‌పైనే కంట్రోల్స్‌ను , 7 అంగుళాల టచ్‌స్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను బ్లూటూత్‌, యూఎస్‌బీ, ఆక్స్‌తో అనుసంధానించుకొనే సౌకర్యం కల్పించారు. ఇక యజమానులకు ఉపయోగపడేలా టెలిమటిక్స్‌ కనెక్టివిటీ, ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను అమర్చారు. ప్రో 2049 వాహనం 1.8మీటర్ల క్యాబిన్‌తో 2.7టన్నుల సామర్థ్యంతో దీనిని తయారు చేశారు. ఇక ప్రో2095ఎక్స్‌పీ 7.2టన్నుల సామర్థ్యం కలిగిఉంది. బాడీ విషయానికి వస్తే 14.1, 17.6, 19, 20, 21 అడుగులతో ఐదు ఆప్షన్లను అందిస్తోంది. దీంతోపాటు యాంటీ రోల్‌ బార్స్‌ను , అన్ని చక్రాలకు డిస్క్‌ బ్రేకులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఈ483 బీఎస్‌4 ఇంజిన్‌తో దీనిని అందజేస్తోంది. మూడు లేదా నాలుగో త్రైమాసికానికి బీఎస్‌6 వాహనానలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.