తెలంగాణ

బిజెపిలో కి మాజీ సీఎం.. షా సమక్షంలో చేరిక

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు బిజెపి లో చేరారు. శనివారం శంషాబాద్‌లో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన  పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు షా నాదెండ్లతో పాటు పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమిత్‌ షా సమక్షంలో బిజెపి లో చేరిన వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నిర్మాత బెల్లంకొండ రమేశ్‌,  రామగుండం డిప్యూటీ మేయర్‌ ఎం సత్యప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం టీడీపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్‌, సిద్ధా వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రవదన్‌, మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాదెండ్ల భాస్కర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  నెల రోజుల పాటు సీఎంగా పనిచేశారు.

శంషాబాద్‌లోని కేఎల్‌ సీసీ హాలులో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు బిజెపి నేతలు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, రాజాసింగ్‌, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా అమిత్‌ షా ఐదుగురికి తన చేతుల మీదుగా సభ్యత్వం అందజేశారు.