క్రైమ్తెలంగాణ

‘ప్రేమ పెళ్లి చేసుకుంటే విడదీసి.. కొట్టారు’

ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న తమను విడదీసే ప్రయత్నం చేయడమే కాకుండా పోలీసులకు తప్పడు ఫిర్యాదు చేయించి కొట్టించారని విశాఖపట్నానికి చెందిన ప్రభాస్‌ పొన్నాన ఆరోపించారు. నగరంలో ఉంటూ బీఎఫ్‌ఏ చేస్తున్న ప్రభాస్‌ ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వివరాల ప్రకారం.. ‘నిజామాబాద్‌ జిల్లా ధర్మవరం నివాసి కె.శ్రీనివాస్‌ కుటుంబం ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఉంటోంది. వీరి కుమార్తె తన్వీని ఆమె సోదరి తృష్ణ ప్రోత్సాహంతోనే ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు కొంత మంది మనుషులతో కలిసి ఈనెల 7న తన్వీని అతన్నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రభాస్‌నూ కొట్టి కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. పెళ్లి ఆధారాలనూ ధ్వంసం చేశారు. పోలీసులూ ఆ రోజు రాత్రి తనను కాళ్లు పైకి, తల కిందకు చేసి కట్టేసి 3గంటలపాటు కొట్టార’ని ఆరోపించారు. వెంటనే తన భార్యను తనకు అప్పగించి, తనపై దాడిచేసిన, చేయించిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై కేపీహెచ్‌పీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణను సంప్రదించగా తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చామే తప్ప, అతన్ని కొట్టలేదన్నారు.