జాతీయం

ప్రజల ఆయువు తీస్తున్న వాయువు..!

వాయుకాలుష్యంతో వచ్చే వ్యాధుల వల్ల భారత్‌లో జీవన కాలం 20 నెలలు తగ్గిందని వాతావరణ మేధో బృందం నివేదిక వెల్లడించింది. వాయుకాలుష్యం వల్ల దేశంలో ప్రమాదకర వ్యాధులు పెరుగుతున్నాయని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ (సీఎస్‌ఈ) తన నివేదికలో పేర్కొంది. వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయువు కాలం తగ్గుతుందని.. ఇది ప్రపంచంతో పొలిస్తే  చాలా ఎక్కువ అని సీఎస్‌ఈ తన నివేదికలో బహిర్గతం చేసింది. కర్బన ఉద్గారాలు, ఓజోన్‌ క్షీణత, ధూమపానం, గృహకాలుష్యం, వాహన, పరిశ్రమల కాలుష్యం వల్ల వాయువు ప్రమాదకర స్థాయిలో కలుషితం కావడమే దీనికి కారణమని వెల్లడించింది. వాయుకాలుష్యంలో గృహాల నుంచి వెలువడే కాలుష్యమే అధికమని స్పష్టంచేసింది. వాయుకాలుష్యం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సోకి 49 శాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వల్ల 33 శాతం, డయాబెటిస్‌, గుండె వ్యాధుల వల్ల 22 శాతం, గుండెపోటుతో 15 శాతం మంది మరణిస్తున్నారని సీఎస్‌ఈ తెలిపింది. వాయుకాలుష్యం శరీరంలో ఉన్న అవయవాన్ని ప్రభావితం చేస్తూ తీవ్ర హాని చేస్తుందని నివేదిక తేలతెల్లం చేసింది. ఈ నివేదికపై ప్రభుత్వం స్పందించలేదు.