తెలంగాణ

‘పుర’పోరు.. 14న ఓటర్ల తుది జాబితా

పురపాలక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు. అప్పటికల్లా రిజర్వేషన్లు కూడా ఖరరావుతాయని, ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో నాగిరెడ్డి సోమవారం సమావేశమయ్యారు. 48 రాజకీయ పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురపాలికల్లో 50 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 11న కలెక్టర్లు, ఎస్పీలతోనూ, 13న మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశమవుతామని తెలిపారు.
ఈ ఎన్నికల్లో దాదాపుగా పాత పోలింగ్‌ కేంద్రాలనే ఉపయోగిస్తామని నాగిరెడ్డి చెప్పారు. ఒక్కోపోలింగ్‌ కేంద్రం పరిధిలో దాదాపు 800 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు రూ.2లక్షలు వ్యయపరిమితి విధించామని, కార్పొరేషన్లలో కార్పొరేటర్లకు రూ.3లక్షల వ్యవపరిమితిని నిర్దేశించినట్లు వెల్లడించారు. గుర్తింపు పొందిన పార్టీలకు వారి గుర్తులను కేటాయిస్తామని, గుర్తింపు పొందని పార్టీలకు నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.