అంతర్జాతీయం

పాక్‌ ఢమాల్‌..

ఇంగ్లాండ్‌లో పిచ్‌లు ఇప్పుడు బ్యాటింగ్‌కు స్వర్గధామాలు.. ప్రపంచకప్‌లో పరుగుల వరద ఖాయం అన్నది అందరి అభిప్రాయం. కానీ పాకిస్థాన్‌ పాకిస్థానే. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని ఆ జట్టు ‘అలవాటు’ ప్రకారమే ఆడింది. అస్థిరత్వంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూ.. తన ఆరంభ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒషేన్‌ థామస్‌, రసెల్‌, హోల్డర్‌ల పదునైన పేస్‌కు 21.4 ఓవర్లలో కేవలం 105 పరుగులకే కుప్పకూలిన పాక్‌.. వెస్టిండీస్‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌ కనీసం టీ20 మ్యాచ్‌ అంతసేపైనా సాగలేదు. 218 బంతులు మిగిలి ఉండగానే కరీబియన్‌ జట్టు పాక్‌ కథను ముగించడం విశేషం.

నాటింగ్‌హామ్‌

అక్కడ ఇంగ్లాండ్‌ 481 పరుగులు బాది ఎంతో కాలం కాలేదు. కానీ అదే వేదికలో పాకిస్థాన్‌ పేకమేడలా కుప్పకూలింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ఆ జట్టు శుక్రవారం అత్యంత ఏకపక్షంగా సాగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో భంగపడింది. పేస్‌ బౌలర్లు ఒషేన్‌ థామస్‌ (4/27), జేసన్‌ హోల్డర్‌ (3/42), రసెల్‌ (2/4)ల ధాటికి విలవిల్లాడిన పాకిస్థాన్‌.. 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచకప్‌ చరిత్రలో ఆ జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. ఫకర్‌ జమాన్‌ (22), బాబర్‌ అజామ్‌ (22) టాప్‌ స్కోరర్లు. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్‌  13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. గేల్‌ (50; 34 బంతుల్లో 6×4, 3×6) తనదైన శైలిలో విధ్వంసం సృష్టించగా.. నికోలస్‌ పూరన్‌ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలి ఉన్న బంతుల పరంగా పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌లో ఇదే అతి పెద్ద ఓటమి. గత 12 వన్డేల్లో పాక్‌కు ఇది 11వ పరాజయం. మిగిలిన ఒక్క మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయింది.

పాక్‌ గిలగిల: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ది మొదటి నుంచి తడబాటే. విండీస్‌ పేసర్ల  ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పిచ్‌పై డాన్స్‌ చేయక తప్పలేదు. ఆరంభంలో పిచ్‌ నుంచి లభించిన సహకారాన్ని వెస్టిండీస్‌ పేసర్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. హోల్డర్‌ పరుగులిచ్చినా.. ఎడమచేతి వాటం పేసర్‌ కోట్రెల్‌ (1/18) పాక్‌కు సమస్యలు సృష్టించాడు. తన తొలి మూడు ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ (2)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత రసెల్‌.. పాక్‌ను గట్టి దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ఫకర్‌ జమాన్‌ను బౌల్డ్‌ చేసిన అతడు.. పదో ఓవర్లో సోహైల్‌ (8)నూ వెనక్కి పంపాడు. కాసేపటికే బాబర్‌ అజామ్‌ కూడా నిష్క్రమించాడు. ఆ తర్వాత హోల్డర్‌.. పాక్‌ను హడలెత్తించాడు. తొమ్మిది బంతుల వ్యవధిలో సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, హసన్‌ అలీలను ఔట్‌ చేశాడు. మధ్యలో షాదాబ్‌ ఖాన్‌ను థామస్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆఖర్లో వాహబ్‌ రియాజ్‌ (18; 11 బంతుల్లో 1×4, 2×6) బ్యాట్‌ ఝుళిపించకపోయి ఉంటే పాకిస్థాన్‌ స్కోరు వంద కూడా దాటేది కాదు.

గేల్‌ ధనాధన్‌: ఓటమిలో పాకిస్థాన్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం.. పేస్‌ బౌలర్‌ ఆమిర్‌ రాణించడం. హసన్‌ అలీ (4 ఓవర్లలో 39), వాహబ్‌ రియాజ్‌ (3.4 ఓవర్లలో 40) ధారాళంగా పరుగులుచ్చినా.. ఆమిర్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో పడ్డ మూడు వికెట్లూ అతడికే చిక్కడం విశేషం. విండీస్‌ తేలిగ్గానే విజయాన్ని అందుకుంది. గేల్‌ తనదైన శైలిలో ఆరు ఫోర్లు, మూడు భారీ సిక్స్‌లతో అలరించాడు. షై హోప్‌ (11), డారెన్‌ బ్రావో (0) విఫలమయ్యారు. జట్టు స్కోరు 77 వద్ద గేల్‌ ఔట్‌ కాగా.. హెట్‌మయర్‌ (7 నాటౌట్‌)తో కలిసి పూరన్‌ (34 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: ఇమాముల్‌ హక్‌ (సి) హోప్‌ (బి) కోట్రెల్‌ 2; ఫకర్‌ జమాన్‌ (బి) రసెల్‌ 22; బాబర్‌ అజామ్‌ (సి) హోప్‌ (బి) థామస్‌ 22;  సోహైల్‌ (సి) హోప్‌ (బి) రసెల్‌ 8; సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌ (సి) హోప్‌ (బి) హోల్డర్‌ 8; హఫీజ్‌ (సి) కోట్రెల్‌ (బి) థామస్‌ 16; ఇమాద్‌ వసీమ్‌ (సి) గేల్‌ (బి) హోల్డర్‌ 1; షాదాబ్‌ ఖాన్‌ ఎల్బీ (బి) థామస్‌ 0; హసన్‌ అలీ (సి) కోట్రెల్‌ (బి) హోల్డర్‌ 1; వాహబ్‌ రియాజ్‌ (బి) థామస్‌ 18; ఆమిర్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (21.4 ఓవర్లలో ఆలౌట్‌) 105
వికెట్ల పతనం: 1-17, 2-35, 3-45, 4-62, 5-75, 6-77, 7-78, 8-81, 9-83; బౌలింగ్‌: కోట్రెల్‌ 4-0-18-1; హోల్డర్‌ 5-0-42-3; రసెల్‌ 3-1-4-2; కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 4-0-14-0; ఒషేన్‌ థామస్‌ 5.4-0-27-4

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: క్రిస్‌ గేల్‌ (సి) షాదాబ్‌ (సి) ఆమిర్‌ 50; షై హోప్‌ (సి) హఫీజ్‌ (బి) ఆమిర్‌ 11; డారెన్‌ బ్రావో (సి) అజామ్‌ (బి) ఆమిర్‌ 0; నికోలస్‌ పూరన్‌ నాటౌట్‌ 34; హెట్‌మయర్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (13.4 ఓవర్లలో 3 వికెట్లకు) 108
వికెట్ల పతనం: 1-36, 2-46, 3-77; బౌలింగ్‌: మహ్మద్‌ ఆమిర్‌ 6-0-26-3; హసన్‌ అలీ 4-0-39-0; వాహబ్‌ రియాజ్‌ 3.4-1-40-0