అంతర్జాతీయం

పాక్‌లో మరోసారి అవమానం

పాకిస్థాన్‌లోని భారత అధికారులకు మరోసారి అవమానం జరిగింది. పాక్‌లోని భారత హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా ఇస్లామాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో శనివారం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. దీనికి భారత అధికారులు, దౌత్యవేత్తలను అతిథులుగా ఆహ్వానించారు. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరితో అక్కడి భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు స్వయంగా అతిథులే పేర్కొనడం గమనార్హం. మరికొంత మందిని తిప్పి పంపినట్లు కూడా తెలిపారు. దీంతో కార్యక్రమానికి రావాల్సిన వారి సంఖ్య బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అక్కడి భద్రతా సిబ్బంది ప్రవర్తనకు బిసారియా భారత అధికారులందిరికీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ‘‘అదనపు తనిఖీలకు లోనైన ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాను’’ అని సమావేశంలో పాల్గొన్న అధికారులను ఆయన కోరడం గమనార్హం. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలు, భారత టీవీ ఛానెళ్లలో ప్రసారం అయింది.

ఈ సందర్భంగా బిసారియా మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇక్కడ ఇఫ్తార్‌ విందు జరగడం.. అనుకోకుండా ఒకేసారి జరిగిపోయాయి. నూతన ప్రభుత్వం కొత్త ఆశలు, లక్ష్యాలతో కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసే సంప్రదాయం గత 12 ఏళ్లుగా కొనసాగుతోంది. కాగా, పాక్‌లో భారత అధికారులకు అవమానాలు ఎదురుకావడం ఇది కొత్తేమీ కాదు. గతంలో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న సిక్కు దేవాలయ సందర్శనకు బిసారియా వెళ్లినప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఆయన్ని అనుమతించకుండా తిప్పి పంపారు. మరో ఘటనలో విచారణ పేరిట భారత అధికారులను దాదాపు అరగంటకు పైగా రోడ్డుపైనే నిలిపివేశారు. అంతేగాక అనేక సార్లు భారత అధికారుల నివాసాలకు గ్యాస్‌ సరఫరాలో జాప్యం చేయడం, అంతర్జాల సేవల్ని నిలిపివేయడం, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించచడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపై స్పందించిన భారత్‌.. పాక్‌ ప్రభుత్వానికి అనేక సార్లు నోటీసులు జారీ చేసింది. భారత్‌ అధికారుల రక్షణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.