క్రీడలుజాతీయం

ధోనీ రిటైర్మెంట్‌పై లతా మంగేష్కర్‌ ట్వీట్‌

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై లెజండరీ గాయని లతా మంగేష్కర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ మధ్యకాలంలో నేను మీ రిటైర్మెంట్‌ గురించి చాలా వార్తలు వింటున్నాను. దయచేసి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దేశానికి మీలాంటి క్రీడాకారులు ఎంతో అవసరం. రిటైర్మెంట్‌ విషయంపై మీరు ఆలోచించకూడదని నేను వేడుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

మరోపక్క ప్రపంచకప్‌ను మరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది. నిన్న జరిగిన సెమీస్‌లో కివీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. దాంతో టీమిండియా క్రికెటర్లు బాధాతప్త హృదయాలతో స్వదేశానికి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ధోనీ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటన చేస్తారు? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.