తెలంగాణ

తెలంగాణలో ముగిసిన ప్రచార పర్వం

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వానికి గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. ఈ సాయంత్రం 5గంటలకే ప్రచారాన్ని ముగించాలన్న ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో మైకులన్నీ మూగబోయాయి. అయితే నిజామాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం ప్రచారానికి సాయంత్రం 6 గంటల వరకు సమయమిచ్చారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలూ చెమటోడ్చారు. గురువారం 13 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. నిజామాబాద్‌లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో మొత్తం 2,96,97,279 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల బరిలో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా.. అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.