క్రైమ్తెలంగాణ

చెల్లి అని పిలిచాడు.. పెళ్లాడాడు!

దగ్గరి బంధువు కావడంతో తరచూ ఇంటికి వచ్చిపోతుండేవాడు.. జైనాబ్‌ ఫాతిమాను చెల్లి అంటూ ప్రేమగా పిలిచేవాడు.. ఇదంతా నిజమేనని నమ్మాం.. చివరకు ప్రేమ పేరిట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.. ఇంత మోసానికి పాల్పడిన షేక్‌ ఇంతియాజ్‌ను అంతమొందించాలనుకున్నాం అంటూ.. ఎస్సార్‌నగర్‌లో నవదంపతులపై దాడి చేసిన నిందితులు పోలీసుల విచారణలో ఈమేరకు వెల్లడించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను(వీరంతా జైనాబ్‌ ఫాతిమా కుటుంబ సభ్యులు) అరెస్టు చేశారు. ఆదివారం ఎస్సార్‌నగర్‌ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, డీఐ వై.అజయ్‌కుమార్‌లతో కలిసి పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. వాస్తవానికి ఫాతిమాకు ఇదివరకే నిశ్చితార్థమైంది. వరుడు సౌదీ అరేబియాలోని ఓ మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్నాడు. మంచి సంబంధం దొరికిందని సంతోష పడుతున్నంతలో షేక్‌ ఇంతియాజ్‌ తమ కుమార్తెను పెళ్లి చేసుకోవడం ఆ కుటుంబానికి మింగుడు పడలేదు. పరువుపోయినట్లయింది. దీనంతటికి కారణమైన ఇంతియాజ్‌ను చంపాలనుకున్నారు. ముఖ్యంగా ఫాతిమా సోదరుడు సయ్యద్‌ ఫారూఖ్‌ అలీ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా హత్య చేయాలనుకొని తన కుటుంబ సభ్యులను ప్రేరేపించాడు. పాత కిరాయి నేరస్థులైన రబ్బానీ, షకీల్‌ల సాయం కోరాడు. పథకం ప్రకారమే సంగారెడ్డిలో ఉన్న ఇంతియాజ్‌ను ఎస్సార్‌నగర్‌కు రప్పించి దాడి చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి 7 అంగుళాల పొడవు ఉండి, మేకల తోలు వలిచేందుకు ఉపయోగించేది కావడంతో, అతనికి ప్రమాదకరమైన గాయాలేమీ కాలేదు. ప్రాణాలతో బయటపడ్డాడు. దాడి అనంతరం పారిపోయిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించి గాలించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసు ఠాణా పరిధిలోని షాహిత్‌నగర్‌లో నిందితులను పట్టుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఫాతిమా తల్లిదండ్రులు సయ్యద్‌ మోసిన్‌ అలీ, షాకీర్‌ బేగం, సోదరులు సయ్యద్‌ ఫారూక్‌ అలీ, సయ్యద్‌ అహ్మద్‌ అలీ, సోదరి సయ్యద్‌ జేబా ఫాతిమా, బావ సయ్యద్‌ మహ్మద్‌ అలీలను పోలీసులు అరెస్టు చేశారు. పాత కిరాయి నేరస్థులు రబ్బానీ, షకీల్‌ పరారీలో ఉన్నారు. రబ్బానీ పలు నేరాల్లో నిందితుడు. ఇటీవలె జైలు నుంచి విడుదలయ్యాడు.

నిందితులందరిపై హిస్టరీ షీట్లు: డీసీపీ
నిందితులందరిపై హిస్టరీ షీట్లను తెరుస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మరో మారు వీరు ఏదైనా నేరానికి పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. నిందితులు పాశవికంగా కత్తితో దాడి చేస్తుంటే పెద్ద సంఖ్యలో గుమిగూడిన పౌరులు తమ చరవాణుల్లో చిత్రీకరించారే తప్ప ఎవరూ దాడిని ఆపే ప్రయత్నం చేయకపోవడం శోచనీయమన్నారు. నిందితుల మానసిక స్థితిని పోలీసులు అంచనా వేయలేకపోయారనే ప్రశ్నను డీసీపీ కొట్టిపారేశారు. ఇరు వర్గాలతో తాము మాట్లాడిన తరవాతే ప్రేమ వివాహం సుఖాంతమైందని, ఆ తరువాత దాడి జరుగుతుందనే విషయం తాము అంచనా వేయలేకపోయామన్నారు. ఇంతియాజ్‌కు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు.

కోలుకుంటున్న ఇంతియాజ్‌
పంజాగుట్ట: ప్రస్తుతం నిమ్స్‌లో ఇంతియాజ్‌ కోలుకుంటున్నాడు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న అతని చెవికి ప్లాస్టిక్‌ సర్జన్‌ కుట్లు వేశారు. ముఖంపై అయిన కత్తి గాయాలకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని, నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉందని నిమ్స్‌ వైద్యులు తెలిపారు.