తెలంగాణసినిమా

చిన్మయీ.. చాలా నిరాశ చెందా: అనసూయ

గతంలో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని తను ఖండించినప్పుడు చిన్మయి మద్దతు ఇవ్వకపోవడం బాధాకరమని యాంకర్‌, నటి అనసూయ అన్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదల తర్వాత ఆ చిత్రంపై అనసూయ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆమె మాటలపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రం గురించి సందీప్‌ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ మహిళతో  ప్రేమలో ఉన్నప్పుడు అందులో చాలా నిజాయతీ ఉంటుంది. ఒకరిపై మరొకరు చేయి చేసుకునే స్వేచ్ఛ లేనప్పుడు అక్కడ ప్రేమ, ఎమోషన్‌ ఉంటుందని నేను అనుకోను. నా సినిమాను విమర్శించిన మహిళను (క్రిటిక్‌) బహుశా ఎవరూ ప్రేమించలేదేమో. ఓ అబ్బాయి నా అనుకుంటున్న అమ్మాయిని ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు.. నాకైతే అక్కడ ఎమోషన్‌ కనిపించదు’ అని అన్నారు.

అయితే సందీప్‌ వ్యాఖ్యలపై చిన్మయి, సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అలా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అనసూయ సోమవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘శక్తిమంతమైన మహిళ చిన్మయి.. తొలుత నేను సందీప్‌ మహిళల హక్కులపై చేసిన కామెంట్లను ఖండించినప్పుడు మీరు నాకు మద్దతుగా నిలవకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఇప్పుడు నేను మీ స్పందనతో కాస్త బలపడ్డాను. ప్రేమించడం అంటే గౌరవించడమని అర్థం’ అని ట్వీట్‌ చేశారు.