అంతర్జాతీయంక్రీడలు

కోహ్లీ చేతి వేలికి గాయం

మరో మూడు రోజుల్లో ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లీ కుడి చేతి బొటన వేలుకు గాయమైంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయంతో కోహ్లీ విలవిల్లాడాడు. వెంటనే టీమిండియా ఫిజియో పాట్రిక్.. అతని బొటన వేలిపై స్ప్రే చేసి ప్రథమ చికిత్స చేశాడు. కోహ్లీకి గాయం బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అయిందా.. లేదా ఫీల్డింగ్‌లోనా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే ప్రాక్టీస్‌ సెషన్‌ ముగింపు సమయంలో కోహ్లీ ఐస్‌ గ్లాస్‌లో వేలు పెట్టుకుని ముందుకు నడవడం కనిపించింది.

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టడానికి టీమిండియా సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ గాయం వార్త భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ గాయంపై బీసీసీఐ కానీ, జట్టు యాజమాన్యం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయ లేదు. అయితే గాయం నుంచి కోలుకోవడానికి కోహ్లీకి తగినంత సమయం ఉందని పలువురు అంటున్నారు. కోహ్లీ తొలిసారి ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మెగాటోర్నీలో భాగంగా భారత జట్టు ఈ నెల 5న తొలి మ్యాచ్‌ ఆడనుంది. సౌథాంప్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో కోహ్లీసేన తలపడనుంది.