అంతర్జాతీయంక్రీడలు

ఇది నాకు మంచి పునరాగమనం

ప్రపంచ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. డేవిడ్‌ వార్నర్‌(89; 114 బంతుల్లో 8×4), ఆరోన్‌ఫించ్‌(66; 49 బంతుల్లో 6×4, 4×6) అర్ధశతకాలతో చెలరేగడంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న డేవిడ్‌ వార్నర్‌కిది ఘనమైన ఆరంభమనే చెప్పాలి. నిన్న ఆడిన మ్యాచ్‌లో వార్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ సందర్భంగా వార్నర్‌ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

‘ప్రపంచ కప్‌లోకి ఘన విజయంతో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. అందులో నా పాత్ర కూడా ఉండటం ఇంకా సంతోషాన్నిస్తోంది. ఇది నాకు మంచి పునరాగమనం. ప్రసుతం ఈ ప్రపంచకప్‌ నాకు చాలా అవసరం. నా ఫామ్‌ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాకు ఫించ్‌ మంచి సహకారం అందించాడు. ఆసీస్‌ జట్టు ఇంతకు ముందులా లేదు. జట్టు సభ్యుల మధ్య ఎంతో సయోధ్య ఉంది. వీరి ఉత్సాహానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఈ మ్యాచ్‌కోసం మేం నాలుగు రోజుల ముందే సన్నద్ధమయ్యాం. అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ప్రపంచ కప్‌లో ఇక ముందు కూడా ఆసీస్‌ ఇదే దూకుడు కనబరుస్తుంది’ అని తెలిపాడు