తెలంగాణ

ఆ శూన్యతను మేమే భర్తీచేస్తాం: లక్ష్మణ్‌

రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మణ్‌ పునరుద్ఘాటించారు.  రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ప్రజా పోరాటాల ద్వారా భర్తీ చేస్తామని వివరించారు. ఇప్పటికే భాజపాలో చేరేందుకు అనేకమంది నేతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని తెరాస తప్పు చేయడం సరికాదని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దక్షిణాదిలో కర్ణాటక తర్వాత భాజపా అధికారంలోకి వచ్చేది  తెలంగాణలోనే. ప్రభుత్వ వైఫల్యాలు, కుటుంబ పాలనపై  పోరాటాలు, ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం. తెదేపా దాదాపు కనుమరుగైంది. కాంగ్రెస్‌ మునిగిపోతున్న పడవ. ఈ రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నివేదిక ఇవ్వబోతున్నాం. అధికార పార్టీతో పొత్తులో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది’’ అని లక్ష్మణ్‌ విమర్శించారు.