ఆంధ్రప్రదేశ్

అసత్యాలతో సవాల్‌ విసురుతున్నారు: చంద్రబాబు

శాసనసభలో కరవుపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసత్యాలతో సవాల్‌ విసిరారని ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సభలో ప్రతిపక్షాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం సాయంత్రం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వడ్డీలేని రుణాలు మంజూరు చేసిన ఆధారాలను బయట పెట్టిన ఆయన..  హోంగార్డు, మీడియాను వైకాపా నేతలు దూషించిన ఆడియోను విన్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు పూర్తి వడ్డీ రాయితీ అని గతంలో మేం చెప్పాం. వడ్డీ రాయితీ అసలు ఇవ్వనేలేదని సీఎం జగన్‌ చెబుతున్నారు. గతంలోనూ వడ్డీ రాయితీలు ఇచ్చారని  రామానాయుడు సభలో చెప్పారు. 2014కు ముందున్న బకాయిల్ని కూడా మేం చెల్లించాం. 2017 -18 నాటికి రూ.500 కోట్లు అని పెండింగ్‌లో ఉంది. జగన్‌కు అసలు విషయంపైనే అవగాహన లేదు. 2014కు ముందు బకాయి ఉన్న డబ్బులు కూడా చెల్లించాం. 2013 నుంచి 2019 వరకు పావలా వడ్డీ కింద రూ.25.14 కోట్లు చెల్లించాం. సున్నా వడ్డీ కింద రూ.75 కోట్లు చెల్లించాం. 2017 -18 నాటికి రూ.500 కోట్లు పెండింగ్‌లో ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు!
‘‘ప్రతిపక్షాల మనోభావాలను దెబ్బతీసి కించపరచాలని చూస్తున్నారు. అహంభావంతో రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. 2016 మార్చిలో రీయింబర్స్‌మెంట్‌ జరిగినట్టు ఎస్‌ఎల్‌బీసీలో ఉంది. సీఎం అయిన వ్యక్తికి 40 రోజుల్లో నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఇన్ని ఆధారాలు ఉంటే నన్ను రాజీనామా చేయమంటున్నారు. ఆగమేఘాల మీద స్పీకర్‌ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. వైకాపా నేతల తీరుపై సీఎం జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి. కరవుపై చర్చించాలని యాచించినా స్పందించలేదు. అచ్చెన్నాయుడు కనీసం ఐదు నిమిషాల పాటైనా చర్చించాలని కోరినా స్పందన కరవైంది. రామానాయుడు ప్రసంగం కూడా పూర్తి చేయనీయలేదు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

అధికారం కావాలి.. భారం మాత్రం వద్దా?

‘‘సున్నా వడ్డీ అనేది కొత్తదేమీకాదు.. పాత పథకానికి పేరు మార్చారు. జనవరి నుంచి జూన్‌ వరకు రైతులకు రూ.2వేల చొప్పున ఇచ్చాం.  జులైలో రూ.250 అదనంగా కలిపి రూ.2250లు ఇచ్చాం. వైఎస్‌ హయాంలో ఐదేళ్లు విద్యుత్‌ సర్‌ఛార్జీలు వేశారు. అధికారం కావాలి.. భారం మాత్రం వద్దా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.