తెలంగాణ

అవినీతి తహసీల్దార్‌ లావణ్య అరెస్టు

రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నివాసంలో పెద్ద మొత్తంలో నగదు లభించడంతో ఈ కేసును మరింత శోధిస్తున్నారు. ఆమె గత కార్యకలాపాలపై వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు ఆమె నివాసంలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆమెను అరెస్టు చేశారు. ఆమె భర్త వెంకటేశ్‌ నాయక్‌ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మున్సిపల్‌ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

కొందుర్గు వీఆర్వో అనంతయ్య నిన్న ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా.. లావణ్య వ్యవహారం బయటపడింది. లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం తీసుకుంటున్నట్టు ఏసీబీ విచారణలో గుర్తించారు. హయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు జరపగా.. రూ.93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో లావణ్యను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.