తెలంగాణ

‘అమ్మా నాన్నా.. నన్ను క్షమించండి’

ఇప్పటివరకూ కళాశాలకే పరిమితమైన ర్యాగింగ్‌ భూతం పాఠశాలలకూ వ్యాపిస్తోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఈ రాక్షస సంస్కృతి హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పదో తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకొనేందుకు ప్రయత్నించే స్థాయికి దారి తీసింది. తోటి విద్యార్థులు తనను వేధిస్తున్నారంటూ పదో తరగతి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై  సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కర్మన్‌ఘాట్‌లోని నియో రాయల్‌ పాఠశాలలో ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు ఇద్దరు డబ్బులు తేవాలంటూ తనను కొట్టి వేధిస్తున్నారని సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లోని గదిలో కొక్కేనికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గది తలుపులు మూసి ఉన్న విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వాటిని తెరిచే ప్రయత్నం చేయగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీలో నుంచి చూడగా కుమారుడు కొక్కేనికి వేలాడుతూ కన్పించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి విద్యార్థిని కిందకు దింపారు. హుటాహుటీన సమీపంలోని గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ కంట తడిపెట్టిస్తోంది.

సూసైడ్‌ నోట్‌లో ఏముంది?
‘‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. మా స్కూళ్లో నన్ను ఇద్దరు విద్యార్థులు డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నారు. రూ.1000 తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. ఐ మిస్సింగ్‌ యూ అమ్మా. ఓ విద్యార్థి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.6వేలు తీసుకున్నాడు’’అని లేఖలో పేర్కొన్నాడు.