జాతీయం

అమలాపాల్‌ నిజంగా ధైర్యం చేసింది!

కథానాయిక అమలాపాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆమె’ సినిమా టీజర్‌ విడుదలైంది. బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ టీజర్‌ను విడుదల చేశారు. కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. ఇలా ఒక్కో సన్నివేశాన్ని టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు.  ‘మీ ప్రేమ, అభిమానంతో మరో ప్రయాణం మొదలు పెట్టాను. మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాకు కావాలి. త్వరలో ‘ఆమె’ విడుదల కాబోతోంది’ అని అమలాపాల్‌ పేర్కొన్నారు. రత్నకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ టీజర్‌ను చూసిన సినీ ప్రముఖులు అమలపాల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడానికి నిజంగా ధైర్యం కావాలని ప్రశంసిస్తున్నారు.

టీజర్‌ అద్భుతంగా ఉంది: సమంత
‘ఆమె’ సినిమా టీజర్‌ అద్భుతంగా ఉందని కథానాయిక సమంత ట్వీట్‌ చేశారు. అమలాపాల్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సినిమా గురించి తెలుసుకోవాలనే ఆతృత పెరిగిందని అన్నారు. చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.