తెలంగాణ

అప్పటిదాకా ఆ భవనాల్ని కూల్చొద్దు:హైకోర్టు

సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం ఆ భవనాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చివేయబోమని హామీ ఇవ్వాలని ధర్మాససనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ అన్నారు. దీంతో కేసును హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ఇది ప్రజా విజయం: విశ్వేశ్వర్‌రావు
దీనిపై పిటిషనర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్త భవనాలతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఈ అంశంపై సుమారు మూడు గంటల పాటు వాదనలు సాగాయని చెప్పారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్‌ వేసిందని.. తామూ వేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం విశాలంగా ఎంతో బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ కమిటీ అయినా సచివాలయ భవనం పనికిరాదని నివేదిక ఇచ్చిందా? అని తమ పిటిషన్‌లో ప్రశ్నించినట్టు చెప్పారు. కేసు తేలేంత వరకు భవనాలు కూల్చొద్దని హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని ఆయన ప్రజా విజయంగా అభివర్ణించారు.