ఆంధ్రప్రదేశ్క్రైమ్

అన్నవరంలో దారుణం

శంఖవరం: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు విషాహారం తిని అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ మృతికి భర్త, అత్తామామలే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తుండడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం గ్రామానికి చెందిన రమేష్‌తో విశాఖ జిల్లా నాతవరం మండలం కె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన సుష్మ రాజ్యలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు(దీపు), తొమ్మిది నెలల మరో కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో తమ కుమార్తెను అత్తమామలు ఆస్తి కోసం వేధించారని, ఈ క్రమంలోనే ఆ ముగ్గురినీ హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.