జాతీయం

8 మంది రాజీనామాలు సరిగా లేవు

కర్ణాటక ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం నిమిషానికో మలుపు తిరుగుతోంది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ తీసుకునే నిర్ణయంపైనే సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. అయితే గత శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించగా.. వీరిలో 8మంది శాసనసభ్యుల రాజీనామా పత్రాలు సరిగా లేవని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ తాజాగా తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ నెల 12, 13, 15వ తేదీల్లో తనను వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ చెప్పారు.

మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు వెంటనే తిరిగి రావాలని లేదంటే వారిపై అనర్హత వేటు వేయమని కోరుతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య అన్నారు. ఈ ఉదయం సీఎల్పీ భేటీ ముగిసిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి.. ఆరేళ్ల పాటు వారు పోటీ చేయకుండా నిషేధం విధించాలన్నారు.

ఇదిలా ఉండగా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం పుణెలో ఉన్నారు. ముంబయి నుంచి నిన్న సాయంత్రం మకాం మార్చిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ స్పీకర్‌ తమ రాజీనామాలను ఆమోదిస్తే తిరిగి బెంగళూరుకు రావాలనుకున్నారు. మరి తాజా పరిణామాల నేపథ్యంలో అసమ్మతులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.