క్రీడలు

68 గజాల దూరం నుంచి గోల్‌: ట్విటర్‌లో మోత

ఫుట్‌బాల్‌ అంటేనే మంచి కిక్కిచ్చే ఆట! ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి బంతిని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే ఎంతో కష్టం. ఇక అవతలి కోర్టులోకి వెళ్లి సమీపం నుంచి గోల్‌పోస్ట్‌లోకి బంతిని లాఘవంగా తరలించడం మామూలు విషయం కాదు! అలాంటిది ఓ క్రీడాకారుడు తన కోర్టు మిడ్‌ ఫీల్డ్‌లోంచి ప్రత్యర్థి కోర్టు గోల్‌పోస్టులోకి నేరుగా బంతిని కిక్‌ చేశాడు. అంటే ఏకంగా 68 గజాల దూరం అన్నమాట. ఇలాంటి గోల్‌ చేస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా? పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. సామాజిక మాధ్యమాల కాలం కాబట్టి ట్విటర్‌లో మోత మోగించారు. ఆ సంచలన గోల్‌తో అందరినీ కట్టిపడేసిన ఆటగాడు మరెవరో కాదు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు వేన్‌ రూనీ. చేసింది మేజర్‌ లీగ్‌ సాకర్‌ (ఎంఎల్‌ఎస్‌)లో.

ఇంగ్లాండ్‌, ప్రీమియర్‌ లీగ్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ఫుట్‌బాల్‌ వేన్‌రూనీ. జాతీయ జట్టుకు వీడ్కోలు పలికిన తర్వాత ప్రొఫెషనల్‌ క్లబ్‌ల తరఫున ఆటను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం మేజర్‌ లీగ్‌ సాకర్‌లో డీసీ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లాస్‌ ఏంజెల్స్‌లో ఓర్లాండో సిటీతో మ్యాచ్‌లో రూనీ తన గోల్‌తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దాదాపు 68 గజాల దూరంలో తన కోర్టులోంచి బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి కిక్కిచ్చాడు. ఆ సమయంలో ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ బ్రియన్‌ రోవె సైతం గోల్‌పోస్ట్‌కు దూరంగా వచ్చాడు. ఓర్లాండో ఆటగాళ్లంతా డీసీ కోర్టులోనే ఉన్నారు. ఇదంతా గమనించిన రూనీ తెలివిగా చాలాదూరం గోల్‌ కొట్టాడు. అది హిట్టయింది. డీసీ గెలిచింది. ఆనందంతో అభిమానులు గంతులు వేశారు. ట్విటర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడు. మళ్లీ తన అత్యుత్తమ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఎవరు ఏమన్నా లెక్కచేయను. వేన్‌రూనీ ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ అడ్డుకోలేరు’ అని ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. మరికొందరు ‘అద్భుతం’ అని అంటున్నారు.