క్రీడలు

300 పరుగులకే కుప్పకూలిన అసీస్..

  • 300 పరుగులకు ఆసీస్ ఆలౌట్
  • 5 వికెట్లు తీసిన కుల్ దీప్ యాదవ్
  • జడేజా, షమీలకు చెరో రెండు వికెట్లు

సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టును 300 పరుగులకే భారత్ కుప్పకూల్చింది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 622 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసిన తరువాత ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆటకు వరుణుడు కొంతసేపు ఆటంకం కలిగించగా, ఆపై పేస్ బౌలర్లు తమ పని కానిచ్చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఎంఎస్ హారిస్ (79) మినహా మరెవరూ రాణించలేదు. ఖావాజా 27, లాబుస్ చేంజ్ 38, ఎస్ఈ మార్ష్ 8, హెడ్ 20, హాండ్స్ కూంబ్ 37, టీడీ పైనీ 5, పీజే కుమిన్స్ 25, హాజిల్ వుడ్ 21 పరుగులు చేయగా, లియాన్ డక్కౌట్ అయ్యాడు. ఎంఏ స్టార్క్ 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ కు 5 వికెట్లు దక్కగా, జడేజా, షమీ లకు చెరో రెండు, బుమ్రాకు ఒక వికెట్ లభించాయి. ఈ ఉదయం ఆట ప్రారంభమైన తరువాత గంటన్నర వ్యవధిలో మిగిలిన నాలుగు వికెట్లనూ ఇండియా పడగొట్టడం గమనార్హం.