జాతీయం

19న దేశంలోని వ్యాపార వర్గాలతో మోదీ భేటీ

దిల్లీ : దేశంలోని వ్యాపార వర్గాలతో ప్రధాని మోదీ  ఈనెల 19న సమావేశం కానున్నారు. దిల్లీలోని తాలక్‌టోరా స్టేడియంలోని వ్యాపారులతో భేటీ అయి వారి సమస్యలపై ప్రధాని చర్చించనున్నారని కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్‌గోయల్‌ తెలిపారు. ఈ సమావేశానికి వ్యాపారులు, వాణిజ్య సంస్థల అధికారులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. భాజపా ఎన్నికల ప్రణాళిక-సంకల్ప్‌ పత్రపై వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఉన్నాయని.. దేశంలో పలుచోట్ల వ్యాపారులు ప్రధానికి ధన్యవాదాలు కూడా తెలిపారని విజయ్‌ గోయల్‌ అన్నారు. ఈ సంకల్ప్‌ పత్రలో వ్యాపారుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు, చిల్లర వర్తకం కోసం నూతన విధానంతోపాటు 60 ఏళ్లు దాటిన చిన్నతరహా వ్యాపారులకు పింఛను వంటి హామీలు ఉన్నాయి. వీటితోపాటు జీఎస్టీ కింద రిజిస్ట్రర్‌ అయిన వ్యాపారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా,  కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం కింద వ్యాపారులందరికి కార్డులను అందజేస్తామని భాజపా హామీలు గుప్పించింది.