జాతీయం

1.86 లక్షల బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు అందిస్తున్నాం..

భారత జవాన్లకు మొత్తం 1.86 లక్షల బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ… ‘‘2009లో 3,53,755 బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్ల కొరత ఉండేది. అయినప్పటికీ చాలా కాలం పాటు వీటి కొరతను తీర్చలేదు. ఏప్రిల్ 2016లో 1,86,138 బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్ల కోసం ప్రతిపాదన చేశాం. ఇందుకు సంబంధించిన టెండర్ కేటాయింపు ఏప్రిల్‌ 9, 2018న జరిగింది. ఈ బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్ల కాంట్రాక్టు విలువ రూ.638.97 కోట్లు. ఏప్రిల్‌ 8, 2020లోపు ఇవి పూర్తిగా అందుతాయి. ఈ ఏడాది అక్టోబరు 8న వాటిల్లో 37,000 బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు అందుతాయి’’ అని తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం నిరోధంపై రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ… ‘‘ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలు దృష్టిపెడుతున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదులకు నాయకత్వ, వనరుల సంక్షోభం ఉంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతోంది. ఆ దాడి వెనుక నిఘా, భద్రతా వర్గాల వైఫల్యం ఉందా? లేదా? అన్న విషయంపై విచారణ ముగిసిన తర్వాతే సమాధానం చెప్పగలం’’ అని వ్యాఖ్యానించారు.