జాతీయం

​​​​​షోపియాన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఆ జిల్లాలోని గహంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శనివారం ఉదయం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

34 రాష్ట్రీయ రైఫిల్స్‌ (ఆర్‌ఆర్), ప్రత్యేక ఆపరేషన్‌ బృందం (ఎస్‌ఓజీ) ఈ సోదాల్లో పాల్గొన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల వివరాలు, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందారన్న విషయం తెలియాల్సి ఉంది. ఇటీవల ఇదే జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరగగా, ఇద్దరు హిబ్దుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. వారిలో ఓ ఉగ్రవాది ఎంటెక్‌ విద్యార్థి అని, ఇటీవల అతడు ఉగ్రవాద సంస్థలో చేరాడని అధికారులు గుర్తించారు. ఆ ఘటన మరకవ ముందే మరోసారి షోపియాన్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది.