తెలంగాణ

హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్న అందరికీ రేషన్‌కార్డులు

  • నగరంలో ఇప్పటి వరకు 40 వేల దరఖాస్తులు
  •  20 వేల కార్డులు జారీ చేసిన అధికారులు
  •  పరిశీలనలో మిగిలిన దరఖాస్తులు
హైదరాబాద్‌ సిటీ(స్నేహ టీవీ ) :జంటనగరాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్‌ కార్డులను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి కొత్తకార్డులను మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. అయతే ఎన్నికల నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా కొత్తకార్డుల జారీ ప్రక్రియ నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. జంటనగరాల్లోని 9 సర్కిళ్లలో కలిపి 5.67 లక్షల కార్డులు ఉండగా గతేడాది కాలంలగా మరో 40 వేల మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే వీరిలో 20 వేల మందికి కార్డులు అందాయన్నారు. మిగిలిన వారి దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. చాలా సర్కిళ్ల పరిధిలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈపాస్‌ విధానం అమల్లోకి వచ్చాక రేషన్‌ సరుకుల పంపిణీలో పారదర్శకత ఏర్పడిందని ఒక పక్క అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో రేషన్‌ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్నిచోట్ల సరుకులు తీసుకోకపోయినా లబ్ధిదారులు తీసుకున్నట్టుగానే నమోదవుతోంది. ఈ విషయంలో కొందరు రేషన్‌ డీలర్లు చాలా టెక్నిత్‌తో వ్యవహరిస్తున్నారు.
    కేవలం బియ్యం మాత్రమే పంపిణీ జరుగుతోందని అంటున్నా కిరోసిన్‌, గోధుమలు కూడా రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. బియ్యం కోసం వచ్చిన సమయంలోనే గోధుమలు, కిరోసిన్‌ వంటివి తీసుకోకపోయినా లబ్ధిదారులకు తెలియకుండా వారు తీసుకున్నట్టుగా నమోదు చేస్తున్నారు. మళ్లీ ఎప్పుడో గోధుమల కోసమో, కిరోసిన్‌ కోసమో వెళ్లిన వారికి అప్పుడే తీసుకున్నావ్‌ కదా? అంటూ డీలర్లు దబాయిస్తున్నారు. ఇలాంటి మోసాల ద్వారా కొందరు డీలర్లు రేషన్‌ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే కొందరు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.