జాతీయం

హైకోర్టు ఆదేశాలపై ఈసీ ఆరా…

స్నేహ,న్యూఢిల్లీ: తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై విచారణ పూర్తయ్యేంత వరకు తుది ఓటర్ల జాబితా విడుదల చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసినట్టు తెలిసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండటంతో హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం ఏం చేయాలన్నదానిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చర్చించినట్టు తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారుల సమావేశంలో రజత్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇందులో రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల వెబ్‌సైట్ల ప్రామాణీకరణ అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశం అనంతరం రజత్‌కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమై… రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లను వివరించినట్టు తెలిసింది. అయితే, తుది ఓటర్ల జాబితా విడుదలపై శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో..నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణకు కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై ప్రభావం చూపుతుందా అన్న అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసినట్టు తెలుస్తోంది.