జాతీయం

హార్ధిక్‌ హెలికాప్టరా..నా భూమిలో ల్యాండింగొద్దు

అహ్మదాబాద్‌: ఎన్నికల పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్‌ నేత హార్ధిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన భూమిలో ఆయన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు ఓ రైతు ఒప్పుకోలేదు. దీంతో చివరి నిమిషంలో హార్ధిక్‌ రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

గుజరాత్‌లోని మహిసాగర్‌ జిల్లా లునావాడాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం హార్ధిక్‌ పటేల్‌ గురువారం అహ్మదాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాన్ని ఓ ప్రయివేటు భూమిలో ల్యాండ్‌ చేసేందుకు లునావాడాకు చెందిన వినయ్‌ పటేల్‌ అనే వ్యక్తితో స్థానిక నేతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే అది హార్ధిక్‌ పటేల్‌ వస్తున్న హెలికాప్టర్‌ అని తెలుసుకున్న వినయ్‌.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన భూమిలో ల్యాండ్‌ చేసేందుకు ఒప్పుకోనని చెప్పారు. హార్ధిక్‌ ‘శవాలతో రాజకీయం చేస్తున్నారని’ వినయ్‌ ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తన పొలంలో దిగేందుకు అనుమతించబోనని స్పష్టం చేశారు.

‘నా అనుమతి లేకుండానే స్థానిక కాంగ్రెస్‌ నేత ఒకరు నా భూమిలో చాపర్‌ను ల్యాండ్‌ చేసేందుకు అధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అది హార్ధిక్‌ చాపర్‌ అని నాకు చివరి నిమిషంలో తెలిసింది. పాటిదార్‌ ఆందోళన సమయంలో ఎంతో మంది చనిపోయారు. వారి శవాలతో హార్ధిక్ రాజకీయం చేశాడు. అలాంటి వ్యక్తి నా భూమిలో దిగేందుకు నేను ఒప్పుకోను’ అని వినయ్‌ తెలిపారు. దీంతో చేసేది లేక.. హార్ధిక్‌ అహ్మదాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా లునావాడాకు వెళ్లారు.