జాతీయం

హార్దిక్‌ పటేల్‌ చెంప ఛెళ్లుమనిపించిన వ్యక్తి

సురేంద్రనగర్‌: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత  హార్దిక్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లో సురేంద్రనగర్‌ జిల్లాలో ఎన్నికల సభలో మాట్లాడుతున్న ఆయనపై ఓ వ్యక్తి దాడి చేశాడు. హార్దిక్‌ మాట్లాడుతుండగా ఒక్కసారిగా మైక్‌ వద్దకు వచ్చి ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు.

సురేంద్రనగర్‌లోని బల్దానాలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటుచేసిన జన ఆకర్ష్‌ ర్యాలీలో గురువారం హార్దిక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా ఓ వ్యక్తి మైక్‌ వద్దకు వచ్చి హార్దిక్‌ను కొట్టాడు. అంతటితో ఆగకుండా హార్దిక్‌తో వాగ్వాదానికి దిగాడు. వెంటనే అక్కడున్న ప్రజలు అతడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

హార్దిక్‌ కాంగ్రెస్‌లో చేరినందుకే తాను కొట్టానని దాడి చేసిన వ్యక్తి అన్నాడు. పటేల్‌ ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్‌ పటేల్‌ బాధ్యత వహించాలన్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అయ్యింది. అయితే దాడి చేసిన వ్యక్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఘటన అనంతరం హార్దిక్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తనను భయపెట్టడానికి భాజపానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.