జాతీయం

‘హవ్వ..! ఏవిటీ.. రైల్లో మసాజులా?’

రైళ్లలో మసాజ్‌ సేవలను ప్రారంభించాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఇండోర్‌కు చెందిన భాజపా ఎంపీ శంకర్‌ లాల్వానీ రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు.

పశ్చిమ రైల్వేజోన్‌ రత్లాం డివిజన్‌కు చెందిన అధికారులు రైళ్లలో మసాజ్‌ సేవలను ప్రారంభించనున్నామని ఇటీవలే వెల్లడించారు. ఇండోర్‌ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో వీటిని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనివల్ల అధికాదాయం సమకూరుతుందన్నది వారి అభిప్రాయం. దీనిపై శంకర్‌ లాల్వానీ ఈ నెల 10న కేంద్రమంత్రికి లేఖ రాశారు.

‘‘రైళ్లలో మహిళల ముందు అలాంటి సేవలను అందించడం భారతీయ సంస్కృతేనా?ముందు ప్రయాణికులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలాంటి సేవలకు బదులు డాక్టర్లను అందుబాటులో ఉంచడం ఉత్తమం అనేది నా అభిప్రాయం’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఈ ప్రతిపాదన పర్యాటక రైళ్లలోనో లేదా శతాబ్ది, రాజధాని రైళ్లలోనో అందించాలనుకుని ఉండొచ్చు. సాధారణ రైళ్లకు ఈ  సేవలను ప్రవేశపెట్టకపోవచ్చు. అయినా సాధారణ రైళ్లలో ఇలాంటి సేవలు ఎవరికి కావాలి? మూడు నాలుగు గంటల ప్రయాణానికి మసాజులు  ఎవరు కోరుకుంటారు. ఇదో అనవసర ప్రతిపాదన. మహిళా సంఘాలు కూడా దీనిపై ఫిర్యాదు చేయాలి’’ అని మీడియాతో అన్నారు.