అంతర్జాతీయంజాతీయం

హమ్మయ్య! రాహుల్‌ శతకానికి కోహ్లీ ఆనందం

టీమిండియా స్ట్రోక్‌ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో అద్భుత శతకం బాదినందుకు సారథి విరాట్‌ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ ఫామ్‌పై ఆందోళన లేదని అంటున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సన్నాహక మ్యాచ్‌లో భారత్‌ 95 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

‘కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో ఆడిన విధానం టీమిండియాకు అత్యంత సానుకూల అంశం. అందరికీ జట్టులో తమ పాత్రలేంటో తెలుసు. అతడు పరుగులు చేయడం చాలా కీలకం. ఎంఎస్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్య అద్భుతంగా ఆడారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రెండు మ్యాచుల్లోనూ మాకు సవాళ్లు ఎదురయ్యాయి. శిఖర్, రోహిత్‌ నాణ్యమైన ఆటగాళ్లు. ఐసీసీ టోర్నీల్లో వాళ్లు స్టార్లు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఛేదన చేయాలనుకున్నాం’ అని కోహ్లీ అన్నాడు. బంగ్లాపై రాహుల్‌ (108), ధోనీ (113) సమయోచిత శతకాలు బాదేశారు.

‘బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నుంచి మాకు సవాళ్లు ఎదురయ్యాయి. మేం చక్కగా బౌలింగ్‌ చేశాం. స్పిన్నర్లు వికెట్లు తీశారు. బుమ్రా కీలకంగా నిలిచాడు. కుల్‌దీప్‌, చాహల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభమయ్యాక ఉత్కంఠ పెరుగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 15 ఓవర్లలో స్వింగ్‌, సీమ్‌ కీలకం’ అని కోహ్లీ వెల్లడించాడు.