జాతీయం

స్పైస్‌జెట్‌లోకి మరో 16 బోయింగ్‌ విమానాలు

దిల్లీ: ఓ వైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం, మరోవైపు ఇథియోపియా విమాన ప్రమాదంతో బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాల నిలిపివేత.. ఫలితంగా దేశంలో విమానాల కొరత ఏర్పడింది. విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఎయిర్‌లైన్లు చివరి నిమిషంలో సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ త్వరలోనే 16 బోయింగ్‌ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది.

16 బోయింగ్‌ 737-800 ఎన్‌జీ విమానాలను డ్రై లీజు కింద సంస్థలోకి తీసుకుంటున్నట్లు స్పైస్‌జెట్‌ వెల్లడించింది. ఈ విమానాలను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసీ) కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. మరో పది రోజుల్లో ఈ విమానాలు సంస్థలోకి చేరుతాయని పేర్కొంది. కాగా.. ఈ వార్తల నేపథ్యంలో సంస్థ షేర్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో స్పైస్‌జెట్‌ షేరు విలువ దాదాపు 10శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే 90శాతానికి పైగా విమానాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు సంస్థలో 123 విమానాలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 9కి పడిపోయింది. ఇక గత నెలలో ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంతో భద్రతాకారణాల దృష్ట్యా బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దేశంలో అందుబాటులో ఉన్న విమానాల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.