అంతర్జాతీయం

స్నానం చేయకండి..బట్టలు ఉతక్కండి

మైసూరు: దైనందిన జీవితంలో నీటికి ఎంత ప్రాముఖ్యం ఉందో తెలియంది కాదు. ఆహారం తీసుకోకుండా అరురోజులైనా ఉండొచ్చేమో గానీ నీళ్లు తాగకుండా ఆరు గంటలకు కూడా ఉండలేం. రోజులో ఏదో ఒక రూపంలో నీటి అవసరం రానే వస్తుంది. అయితే ఈ నీటి వాడకానికి సంబంధించి హాస్టల్‌ విద్యార్థినులకు మైసూరు యూనివర్సిటీ చేసిన సర్క్యులర్‌ వివాదాస్పదంగా మారింది.

ఆ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దటి తీవ్రంగా ఉంది. మూడు నెలలుగా అక్కడి విద్యార్థినులు బాగా ఇబ్బంది పడుతున్నారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం సమస్యను తీర్చాల్సింది పోయి ‘బట్టలు ఉతక్కండి. స్నానాలు చేయకండి’ అంటూ సర్య్కులర్ జారీ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు ధర్నాకు దిగారు. అక్కడి యాజమాన్యాన్ని, అధికారులను ఉద్దేశిస్తూ ‘మాకు నీళ్లొచ్చే వరకు మీరు కూడా బట్టలు ఉతక్కండి, స్నానం చేయకండి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వైస్‌ ఛాన్సలర్‌ హేమంత్‌ కుమార్‌ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. క్యాంపస్‌లో ఉన్న బోరుబావుల్లో కొన్ని ఎండిపోయాయని దీనివల్లే నీటి కొరత ఏర్పడిందని తెలిపారు.

కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో వారానికోసారి ట్యాంకర్ల ద్వారా అక్కడికి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో నిత్యావసరాల కోసం నీటిని పట్టుకోవడానికి విద్యార్థులు బారులు తీరాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. క్యాంస్‌లో మొత్తం 40 బోరుబావులున్నాయి. ఇక్కడ 65డిపార్ట్‌మెంట్లలో ఉన్న 3,000 మంది విద్యార్థులకు ఇవే నీటిని అందిస్తున్నాయి. ఈ 40 బోరుబావుల్లో 10 పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్నింటిలో నీరు తక్కువగా వస్తోంది. అయితే ఈపరిస్థితిపై మైసూరు సిటీ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేస్తే ఎన్నికలు పూర్తయ్యాక సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పారని వైస్‌ ఛాన్సలర్‌ తెలిపారు.