జాతీయం

 స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం..

న్యూఢిల్లీ: స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, లైంగిక హక్కులను సమర్థించిన సుప్రీంకోర్టు… అదే సమయంలో ‘తప్పు’ చేసే పురుషులకు మరింత విశృంఖలంగా వ్యవహరించే అవకాశం ఇచ్చిందా? ‘మరేం ఫర్లేదు! మీరు చేసేది తప్పు కాదు’ అని తేల్చేసిందా? అలాగే… ఈ సమాజంలో భార్యా బాధితులూ ఉన్నారనే కోణాన్ని విస్మరించిందా? సెక్షన్‌ 497 ఐపీసీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుపై భర్తల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వివాహేతర సంబంధాల్లో సుప్రీంకోర్టు చూడని కోణాలేన్నో వారి కథనాల్లో బయటపడుతున్నాయి. ఈ తీర్పు ‘తప్పు’ చేసే మగాళ్లకు ఊరటనిస్తోందని… తాను నిజాయితీగా ఉంటూ, తన భార్య కూడా అలాగే ఉండాలని ఆకాంక్షించే వారికి శరాఘాతమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు… బెంగళూరుకు చెందిన చైతన్య గౌడది (అసలుపేరు కాదు) ఓ వింత కథ! సెక్షన్‌ 497 ప్రకారం వివాహేతర బంధం పెట్టుకున్న భర్తపై భార్య మాత్రమే కేసు పెట్టగలదు. చైతన్య గౌడ భార్య పెళ్లి తర్వాత కూడా తన పాత ప్రియుడితో కలిసి తిరుగుతోంది. ఆమెపై నేరుగా తాను నేరుగా కేసు పెట్టలేడు కాబట్టి… ప్రియుడి భార్య ద్వారా ఫిర్యాదు చేయించాలని చైతన్య గౌడ భావించారు. భార్య, ఆమె ప్రియుడి సంబంధంపై రెండేళ్లు కష్టపడి పకడ్బందీ ఆధారాలు సంపాదించారు. తీరా చూస్తే… ‘వివాహేతర సంబంధం నేరం కాదు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. ‘‘నా భార్య, ఆమె ప్రియుడు మరింత స్వేచ్ఛగా విహరించేందుకు కోర్టు అవకాశమిచ్చింది’ అని చైతన్య గౌడ వాపోయారు. దేవ్‌జ్యోతి దాస్‌దీ అదే పరిస్థితి. తన భార్యకు ఒకటికి మించి సంబంధాలున్నాయని… దీనికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ‘ఇది తప్పే కాదు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆక్రోశించారు.
తప్పుడు ఫిర్యాదుల నుంచి ఊరట
గృహ హింస (498ఏ)లాగే… 497 ఐపీసీ కూడా దుర్వినియోగమవుతోంది. పుణెకు చెందిన అశోక్‌ దీక్షిత్‌ (పేరు మార్చాం) ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మరేదో కారణంతో కక్ష కట్టిన ఆయన భార్య… దీక్షిత్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ 497 ఐపీసీ కింద కేసు పెట్టింది. ఆ క్షణం నుంచి ఆయన బతుకు దుర్భరంగా మారింది. ఇప్పటికి లాయర్‌ ఫీజు కింద రూ.4 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తనకు ఉపశమనం లభించిందని దీక్షిత్‌ పేర్కొన్నారు. ఇక… కుమార్‌ రమేశ్‌దీ (అసలు పేరు కాదు) ఇదే కథ. ఆయన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై గట్టిగా నిలదీయడంతో ఆమె భర్తపైనే ‘రివర్స్‌’ 497 ఐపీసీ కేసు పెట్టింది. కుమార్‌ రమేశ్‌కు కష్టాలు మొదలయ్యాయి. తాజా తీర్పుతో ఇవన్నీ తొలగినట్లేనని ఆయన పేర్కొన్నారు.
కుటుంబం మాటేమిటి?
మహిళా సాధికారత పేరిట తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు కుటుంబ సంబంధాలను విస్మరించింది. తీర్పు ఇలా ఏకపక్షంగా ఉండకూడదు.