అంతర్జాతీయం

స్టెయిన్‌ టోర్నీ నుంచి నిష్ర్కమించడం బాధాకరం

ప్రపంచకప్‌లో వరుస ఓటములతో ఢీలా పడిపోయిన దక్షిణాఫ్రికాకు ఆ జట్టు బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ టోర్నీ మొత్తానికి దూరమవ్వడం ఎదురు దెబ్బ అనే చెప్పాలి. భుజానికి గాయం కారణంగా స్టెయిన్‌ ఈ వరల్డ్‌కప్‌ మొత్తానికి దూరమయ్యాడు. నేడు టీమిండియా- దక్షిణాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. స్టెయిన్‌ గాయం గురించి తెలుసుకున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ..స్టెయిన్‌ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. స్టెయిన్‌ చాలా మంచి ఆటగాడని, గట్టి పోటీ ఇచ్చే బౌలర్ అని మాట్లాడి క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాడు.

‘స్టెయిన్‌ టోర్నీ నుంచి నిష్ర్కమించడం చాలా బాధ కలిగించే విషయం. అతడి బౌలింగ్‌లో నేను ఎన్నోసార్లు ఆడాను. ఈ టోర్నీలో అతడి వద్ద నుంచి స్నేహపూర్వక పోటీ ఎదురవుతుందని ఆశించాను. కానీ  హఠాత్తుగా ఇప్పుడతను ప్రపంచకప్‌లో ఆడలేడని తెలిశాక బాధేస్తోంది. ఎందుకంటే మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులం. అతనెప్పుడూ స్ఫూర్తి కలిగించే వ్యక్తి. స్టెయిన్‌ను కొన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకోవచ్చు. చాలా దృఢమైన వ్యక్తి. ఈ గాయాలు, అనారోగ్యం అతడినేమీ చేయలేవు. స్టెయిన్‌ త్వరగా కోలుకోవాలి’ అని అన్నాడు.

స్టెయిన్‌ చాలా కాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ తక్కువ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత వెంటనే చికిత్స నిమిత్తం దక్షిణాఫ్రికాకు తిరిగివచ్చాడు. కాగా, వరల్డ్‌కప్‌లోగా స్టెయిన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆ జట్టు సారథి డుప్లెసిస్‌ కూడా టోర్నీ ఆరంభంలో పేర్కొన్నాడు. కానీ గాయం తీవ్రతలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు.